

ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయనే వార్తల నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య భవితవ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అతడు మరో ఫ్రాంచైజీకి మారవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబయి ఇండియన్స్‌లోనే కొనసాగాలని హార్దిక్ భావిస్తే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. 2024లో రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ అందుకున్న హార్దిక్.. ఆ సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2025లో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ, ఈ ఏడాది మళ్లీ నిరాశపరిచింది. ఈ పరిణామాల వల్ల జట్టులో హార్దిక్ ఒంటరిగా భావించి ఉండొచ్చని రాయుడు పేర్కొన్నాడు.
ముంబయిలో కొనసాగితే కెప్టెన్సీ ఒత్తిడిని పక్కనపెట్టి ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా మారాలని రాయుడు సూచించాడు. మరో ఫ్రాంచైజీకి మారినా కనీసం ఒక సీజన్ పాటు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోకుండా ఆడితే మంచిదని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో హార్దిక్‌కు మంచి అవకాశాలు ఉండవచ్చని, కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మాత్రం కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చని విశ్లేషించాడు. ఇదిలా ఉండగా, హార్దిక్ ట్రేడింగ్‌పై ముంబయి ఇండియన్స్ ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుని, అందుకు బదులుగా హార్దిక్‌ను పంపే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ట్రేడింగ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!