

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. పరీక్ష హాలు, క్యాంపస్, హాస్టల్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ ఘటనకు ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పోలీసులు పునర్నిర్మిస్తున్నారు. పరీక్ష సమయంలో సాహిల్ చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. పరీక్ష హాలులో ప్రొఫెసర్ అతడిని ప్రశ్నించిన అనంతరం బయటకు పంపిన దృశ్యాలు కూడా సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు సాహిల్ మృతికి కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్‌పీఐ-ఏ కార్యకర్తలు ఐఐటీ బాంబే ఎదుట ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి నెలల్లో సాహిల్ ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని సంప్రదించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం అధ్యక్షుడు రాజ్‌కుమార్ పంత్ తెలిపారు. విద్యార్థులు సంస్థాగత సంస్కరణలు కోరుతూ ఆందోళన చేస్తున్నామని, విద్యా పరమైన అక్రమాలను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. హాస్టళ్లలోని సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడకు అమర్చే ఫ్యాన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఐఐటీ యాజమాన్యం ప్రారంభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!