

ఐఐటీ బాంబే (IIT Bombay)లో రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ రవీంద్ర వకోడే మృతి ఘటనపై సంస్థ తాజాగా క్షమాపణలు తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు నిర్ధారణ కాకముందే వాటిని వెల్లడించడం సరికాదని పేర్కొంది. దర్యాప్తు ప్రారంభానికి ముందే విద్యార్థి చాట్‌జీపీటీ వినియోగానికి సంబంధించిన వివరాలను వెల్లడించినందుకు చింతిస్తున్నట్లు తెలిపింది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చదువుతున్న సాహిల్.. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించి ప్రశ్నపత్రాన్ని చాట్జీపిటీలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం విభాగాధిపతి, ఇన్స్ట్రక్టర్ అతడికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సాహిల్ హాస్టల్ గదిలో మృతి చెందడం క్యాంపస్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది.
సాహిల్ మృతికి కుల వివక్షతో కూడిన వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108తో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. పరీక్ష సమయంలో ఇన్వెజిలేటర్గా ఉన్న ప్రొఫెసర్‌ను కూడా పరిపాలనా బాధ్యతల నుంచి సస్పెండ్ చేసినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో విద్యార్థి సంక్షేమం, జవాబుదారీతనం, ఫిర్యాదుల పరిష్కారం, సంస్థాగత సంస్కరణలకు సంబంధించిన 18 డిమాండ్లతో కూడిన చార్టర్‌పై డైరెక్టర్ శిరీష్ కేదారే సంతకం చేశారు. అయితే ఆయన రాజీనామా చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని ఐఐటీ బాంబే స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!