

రహదారుల నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయడంపై విజ్ఞానాన్ని పంచుకోవడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, వినూత్న విధానాలను అన్వేషించడానికి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సు కీలక వేదికగా నిలవనుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 85వ ఐఆర్సీ సదస్సు నిర్వహించనున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇంజినీర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, తయారీదారులు పాల్గొననున్నారు.
ప్రధాన సదస్సుతో పాటు ఈ నెల 19న ఐఆర్సీ 238వ సమావేశం, 20న జాతీయ రహదారుల పరిశోధనా మండలి 90వ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే మార్గాలపై ఈ సదస్సులో చర్చలు జరిగే అవకాశం ఉంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!