

సౌదీ అరేబియాలోని కీలక విమానాశ్రయాలే లక్ష్యంగా హూతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. దమ్మామ్‌లోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా దాడులు జరిగినట్లు సమాచారం. ఆదివారం జరిగిన తాజా దాడిలో రియాద్ విమానాశ్రయంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడినట్లు సౌదీ పౌర విమానయాన అధికారులు వెల్లడించారు. అంతకుముందు జరిగిన దాడిలోనూ ప్రాణనష్టం సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో సౌదీలో విమాన ప్రయాణాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
సౌదీ అరేబియా విమానాశ్రయాలకు విమానాలు, ప్రయాణికులు వెళ్లొద్దని హూతీలు హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, సౌదీ అరేబియా–హూతీల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు. రియాద్ విమానాశ్రయంపై దాడిని తుర్కియే తీవ్రంగా ఖండించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, భద్రతా పరిస్థితుల దృష్ట్యా సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలు, విమానాశ్రయాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తన పౌరులకు సూచించింది. విమానాల రద్దు, గగనతల ఆంక్షలు, ప్రయాణ అంతరాయాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!