

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి వివరాలు వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అతడి కాళ్లకు నిర్వహించిన ఎక్స్‌రేలో బుల్లెట్లు కనిపించలేదని చెప్పారు. అయితే, కుడి కాలుకు తీవ్ర గాయమైందని, రక్తప్రసరణ నిలిచిపోవడంతో కాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీంతో కాలు సగభాగం తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు.
నిందితుడి ఆరోగ్య పరిస్థితిని అనస్తీషియా వైద్యుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని మల్లీశ్వరి తెలిపారు. ఎక్స్‌రే నివేదికతో పాటు అనస్తీషియా వైద్యుడి నివేదికను పరిశీలించిన తర్వాత కాలు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థిని గోపికపై హేమంత్ రంపంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ జగదీశ్ వివరాల ప్రకారం, ఆత్మకూరు అడవిలో నిందితుడిని పట్టుకునే క్రమంలో సీఐ వెంకటేశ్‌పై అతడు దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు ఎదురుదాడికి దిగడంతో అతడి కాళ్లపై కాల్చారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను ఆదివారం రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!