

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ బైనాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన భారీ సైబర్ దాడి నేపథ్యంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో తమ నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. దీంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు బైనాన్స్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వెళ్లాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.35 వేల కోట్లకు పైమాటే. ఈ పరిణామంతో క్రిప్టో మార్కెట్‌లో ఆందోళన నెలకొంది.
బైనాన్స్‌పై జరిగిన సైబర్ దాడిలో సుమారు 6.3 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహా పలు సంస్థలు, బ్లాక్‌చెయిన్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బైనాన్స్ అప్రమత్తమై గురువారం కస్టమర్ల విత్‌డ్రాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడి జరిగిన తీరు, నిధుల నష్టం, భద్రతా వ్యవస్థలోని లోపాలపై దర్యాప్తు చేపట్టింది. ఆదివారం నుంచి దశలవారీగా విత్‌డ్రాలను పునఃప్రారంభించింది. అయితే సేవలు అందుబాటులోకి రాగానే పలువురు కస్టమర్లు తమ క్రిప్టో ఆస్తులను ఇతర వాలెట్లకు తరలించారు. దీంతో భారీగా నిధులు బయటకు వెళ్లాయి. తొలుత విత్‌డ్రాలు ఒక్కసారిగా పెరిగాయని, ఆ తర్వాత క్రమంగా తగ్గాయని బైనాన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ ఘటనలో కస్టమర్లకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా చూస్తామని బైనాన్స్ హామీ ఇచ్చింది. చోరీకి గురైన క్రిప్టో ఆస్తుల విలువను కంపెనీ సొంత నిధులు, అత్యవసర నిల్వలు, బీమా నిధుల ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చోరీకి గురైన ఆస్తుల విలువలో దాదాపు 95 శాతాన్ని భర్తీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఘటన వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తామే భరిస్తామని, కస్టమర్లపై ఎలాంటి అదనపు భారం మోపబోమని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!