

డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీఎస్సీ అక్రమాలపై బహిరంగంగా మాట్లాడితే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించిందనే అంశానికి సంబంధించి అదనపు ఆధారాలను సమర్పించాలని పిటిషనర్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని సూచిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, బాధిత అభ్యర్థులు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా కోర్టును ఆశ్రయించడానికి వెనుకాడుతున్నారని వాదించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఇప్పటికే డీఎస్సీ నియామకాలను సవాలు చేస్తూ 335 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు నమోదు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!