

భారత్ పలు దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి, కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత యువత ప్రతిభ, నైపుణ్యాలపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ.. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన 51 వేలకు పైగా యువతకు నియామక పత్రాలను అందించారు. సుమారు 40 దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కొత్త మార్కెట్లు, వ్యాపార భాగస్వామ్యాలు, ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నాయని తెలిపారు.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద కొత్త సంస్థల వ్యవస్థగా ఎదిగిందని మోదీ చెప్పారు. గుర్తింపు పొందిన కొత్త సంస్థల్లో దాదాపు సగం రెండో, మూడో శ్రేణి నగరాల నుంచే వస్తున్నాయని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యాపార అవకాశాలను మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!