

విద్యార్థులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ధైర్యం, లక్ష్యసాధనతో ముందుకు సాగాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. రాముడి ధైర్యసాహసాలను గుర్తించిన విశ్వామిత్రుడు రాక్షస సంహారం కోసం ఆయనను ఎంచుకున్నారని వివరించారు. భారత్‌లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దేశం ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందని అన్నారు. 2047 వరకు అమృత్ కాలంగా భావిస్తున్న ఈ కాలంలో దేశం కీలకమైన పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
తన ఉద్యోగ జీవితం ప్రారంభంలో సిక్కింలో పనిచేసిన అనుభవాలను కూడా డోభాల్ విద్యార్థులతో పంచుకున్నారు. అక్కడ ఓ మౌంటెన్ గైడ్ నుంచి నేర్చుకున్న మూడు విజయ సూత్రాలను వివరించారు. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం మొదటి సూత్రమని, ఎక్కడికి వెళ్లాలో స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండటం రెండో సూత్రమని, గమ్యాన్ని చేరుకున్న తర్వాత సురక్షితంగా ఎలా తిరిగి రావాలో తెలుసుకోవడం మూడో సూత్రమని చెప్పారు. ఈ మూడు సూత్రాలు జీవితంలో విజయానికి మార్గదర్శకాలని డోభాల్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!