

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రధాని మోదీ ఏజెంట్లా పనిచేస్తున్నారని విమర్శించారు. భాజపాకు ఆరెస్సెస్ ఎలా పనిచేస్తుందో.. మోదీ కోసం జ్ఞానేశ్‌కుమార్ కూడా అలాగే పనిచేస్తున్నారని ఆరోపించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రజలు స్పందించాలని, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని షర్మిల తెలిపారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ‘నవతరానికి యువతరం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతను స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, క్యూఆర్ కోడ్‌ను ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి పి.వి.మోహన్‌తో కలిసి షర్మిల ఆవిష్కరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!