

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా జూనియర్ డాక్టర్ల స్టైపండ్‌ను 15 శాతం పెంచడం సాధ్యం కాదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్లు మూడు ప్రధాన డిమాండ్లను మంత్రికి వివరించగా, స్టైపండ్ పెంపు మినహా మిగిలిన రెండు డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 15 శాతం పెంపుపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పునరాలోచించాలని, వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు.
ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై వైద్యులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం దూర ప్రాంతాల్లోని బోధనాసుపత్రుల్లో ఖాళీలు భర్తీ కాకపోతేనే ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారితో నాన్-క్లినికల్ పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. ఇంటర్న్‌లకు ఈ ఏడాది 5 శాతం, వచ్చే ఏడాది నుంచి 3 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఈ ఏడాది 3 శాతం స్టైపండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే 15 శాతం పెంపు కోసం జూనియర్ డాక్టర్లు పట్టుబట్టి చర్చల నుంచి బయటకు వచ్చారు. తమ తదుపరి కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తామని ఆబ్జుడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!