

మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరును ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసి ఓ వ్యక్తి పరారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేన సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే), కోట రుక్మిణి పేర్లతో పాటు పార్టీ కార్యాలయ గుర్తులను నిందితుడు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గగర ధరణి అనే వ్యక్తి గతంలో ఓ కన్సల్టెన్సీ ఉద్యోగ నియామక సంస్థలో పనిచేసినట్లు సమాచారం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాయకుల పేర్లను ఉపయోగించి నకిలీ నియామక పత్రాలు సృష్టించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కళ్యాణం శివ శ్రీనివాసరావు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!