

దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపుతూ భయాందోళనలు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శరత్ సుబ్రహ్మణ్యాన్ని ప్రత్యేక బృందం అక్కడ అదుపులోకి తీసుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశంలోని పలు విమానాశ్రయాలకు అతడు నకిలీ బెదిరింపు సందేశాలు పంపినట్లు దర్యాప్తులో గుర్తించారు. తమిళనాడులోని డీఎంకే నాయకులపై వ్యక్తిగత కక్షతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే ఉద్దేశంతో ఈ-మెయిల్స్ పంపినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
దర్యాప్తులో భాగంగా, 2025, 2026 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలకు సుమారు 800 నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే 45 సార్లు బెదిరింపు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, సైబర్ నిఘా సాయంతో నిందితుడి ఆచూకీని గుర్తించిన ప్రత్యేక బృందం చెన్నైలో అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించింది. విచారణ అనంతరం సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!