

అర్నబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరగకుండా రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని హోర్డింగులను వెంటనే తొలగించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని సూచించారు. తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!