

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి తెరను పంచుకోనున్నారు. అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే, ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడంతో సినిమా వాయిదా పడవచ్చంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. హాలీవుడ్ చిత్రాల విడుదల కారణంగా ‘కింగ్’ విడుదల తేదీ మారవచ్చనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో వాయిదా వార్తలకు తెరపడినట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో చెదిరిన బంగారు రంగు జుట్టు, రక్తపు మరకలతో కూడిన దుస్తులు, చేతిలో తుపాకీ, పెదవుల మధ్య ఎర్ర గులాబీతో ఆయన రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చుట్టూ మంటలు, నిప్పురవ్వలు కనిపించే ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. 1999లో వచ్చిన ‘బాద్‌షా’ పాటను గుర్తుచేసేలా ప్రేమికుడి ప్రస్తావనతో కూడిన క్యాప్షన్‌ను కూడా ఆయన జతచేశారు. దీంతో ‘కింగ్’ డిసెంబర్ 24న విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది. అయితే, తుది విడుదల తేదీపై అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!