

వీడియో స్ట్రీమింగ్ రంగంలో యూట్యూబ్‌కు పోటీ ఇచ్చే దిశగా మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు రీల్స్, షార్ట్ వీడియోలపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ప్లాట్‌ఫామ్.. తాజాగా సుదీర్ఘ వీడియోలపైనా దృష్టి సారించింది. గరిష్ఠంగా 90 నిమిషాల నిడివి గల హారిజాంటల్ వీడియోలను అందించే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది. పాడ్‌కాస్టర్లు, హాస్య కళాకారులు, ఇతర కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటికే బ్రెజిల్‌లో పరీక్షించిన ఈ ఫీచర్‌ను తాజాగా అమెరికాకూ విస్తరించింది.
ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ రీల్స్‌కు సుదీర్ఘ వీడియోలను లింక్ చేయవచ్చు. రీల్‌ను వీక్షించినప్పుడు పూర్తి వీడియోను చూడాలనే సందేశం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పూర్తి వీడియోను వీక్షించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ టీవీ యాప్ వీక్షకుల సంఖ్యను పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మరోవైపు, ఎపిసోడ్ల రూపంలో రీల్స్‌ను రూపొందించుకునేలా ‘సిరీస్’ అనే ఫీచర్‌పైనా సంస్థ ప్రయోగాలు చేస్తోంది. మైక్రోడ్రామాలు, వీడియో సిరీస్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో, వచ్చే ఏడాది ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!