

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ పాటలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగళ్ రంగ్’, గతంలో వచ్చిన ‘రావణ తాండవ్’ పాటలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘మంగళ్ రంగ్’లో ఖవ్వాలీ తరహా సంగీతం ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన రెహమాన్.. సంగీతాన్ని రూపొందించేందుకు తాము విస్తృతంగా పరిశోధన చేసి, అనేక ప్రయోగాలు చేసిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌ను గమనిస్తూ కూర్చునే సమయం తనకు లేదని, తన పనిని నిజాయితీగా పూర్తి చేయడంపైనే దృష్టి పెడతానని చెప్పారు. గతంలో విమర్శించిన కొందరే ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని తన కుమారుడు తరచూ చెబుతుంటాడని కూడా రెహమాన్ వెల్లడించారు.
తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ‘రామాయణ’ వంటి ఇతిహాస చిత్రానికి పనిచేయడం ప్రత్యేకమైన బాధ్యతగా భావిస్తున్నానని రెహమాన్ తెలిపారు. ‘రోజా’, ‘బాంబే’, ‘రాక్‌స్టార్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి గత విజయాల సంగీత శైలికే పరిమితం కాకుండా, సంగీత దర్శకుడు నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఐదు భాషల్లో సంగీతం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ‘రామాయణ’ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగలదని అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. అయితే, పూర్తి సంగీతాన్ని విన్న తర్వాతే సినిమా పాటలపై తుది అభిప్రాయానికి రావాలని భావిస్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!