

గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో పేలుళ్లు, హెచ్చరిక సైరన్లతో తీవ్ర కలకలం రేగింది. అల్-రిఫా హెలికాప్టర్ స్థావరం సమీపంలోని అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆదివారం ప్రకటించింది. ఈ లక్ష్యంపై ఆరు డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికా నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణకైనా మరింత కఠినమైన, తీవ్రస్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఈ ప్రకటనతో పాటు పేలుళ్ల వార్తలు వెలువడటంతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎత్తైన, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. వరుస పేలుళ్లు, సైరన్ల శబ్దాలతో స్థానికులు భయాందోళనలకు గురైనట్లు సమాచారం.
మరోవైపు, ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా మరో తప్పు చేస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. అమెరికా చర్చల మార్గాన్ని ఎంచుకుంటుందా, యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటుందా అన్నది తమకు ముఖ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తేనే అమెరికాతో ఒప్పందానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ షరతులను అంగీకరించకుండా మరోసారి దాడులకు పాల్పడితే, యుద్ధ క్షేత్రంలో పరిణామాలను ఇరాన్ సాయుధ దళాలే నిర్ణయిస్తాయని ఘాలిబాఫ్ హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!