

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సమాచారం. ప్రధానితో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి, సంక్షేమ అంశాలపై వినతులు సమర్పించారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో పాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిని మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన సీఎం.. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్ల సాయంతో పాటు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్, వ్యవసాయ అవసరాలకు సరిపడా ఎరువులు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. వీబీ-జీ రామ్ జీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులైన తుమ్మిడిహెట్టి, సమ్మక్క-సారక్క బ్యారేజీలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అదనపు నిధులు కేటాయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రుణ సదుపాయం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిశారు. డిసెంబర్‌లో తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. క్రీడా పోటీలను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!