

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని మూడు ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. డిసెంబర్‌లోగా అవసరమైన పనులు ప్రారంభించి, 2027 చివరి నాటికి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందులో కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా ప్రతిపాదిత బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు ఏర్పాటు చేయనున్న మార్గం కీలకంగా ఉండనుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మొత్తం 34.46 కిలోమీటర్ల మేర పీఆర్‌టీఎస్ నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీ నుంచి రాయదుర్గం వరకు 7.62 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్రాధాన్యంగా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై లీ అసోసియేట్స్ ఇప్పటికే నివేదిక సమర్పించడంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
ఐటీ కారిడార్‌తో పాటు కోర్ హైదరాబాద్‌లో మరో రెండు మార్గాల్లోనూ పీఆర్‌టీఎస్ ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు ఒక మార్గాన్ని ప్రతిపాదించారు. మరో మార్గం అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి బేగంపేట వరకు ఉండనుంది. ఇందులో రవీంద్రభారతి, సచివాలయం, ఐమ్యాక్స్ పరిసర ప్రాంతాలు కూడా కలిసివస్తాయి. గచ్చిబౌలిలోని ఐకియా ప్రాంతం, నెక్లెస్ రోడ్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలతో పాటు పీఆర్‌టీఎస్ డిపోలను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ ఐటీ హబ్‌లకు వెళ్లే ఉద్యోగులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ నుంచి మైండ్‌స్పేస్‌కు సుమారు 15 నిమిషాల్లో చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తొలి దశ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2030 నాటికి రోజుకు 75 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ వ్యవస్థను వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!