

చైత్ర ఆచార్, సూర్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం 418 ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన పొందలేకపోయింది. తాజాగా చిత్రబృందం ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసింది. నవంబర్ 19 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ హారర్ థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.
ఈ సినిమా కథ పట్టణానికి దూరంగా ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. 15 ఏళ్ల పాటు మూతపడి ఉన్న ఆ హాస్టల్‌ను తిరిగి తెరుస్తారు. అయితే, 418 నంబర్ గదిని మాత్రం అలాగే మూసి ఉంచుతారు. ఆ గది గురించి తెలిసినవారు దాని పేరు వినగానే భయపడుతుంటారు. ఆ రహస్యం కారణంగానే హాస్టల్‌లోకి మహిళలకు కూడా ప్రవేశం ఉండదు. వివేక్ అనే విద్యార్థి (సూర్య రాజ్) 417వ గదిలో చేరినప్పటి నుంచి అతడికి భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. పీడకలలు వెంటాడుతుండటంతో పాటు, అతడిపై హత్యాయత్నం కూడా జరుగుతుంది. ఈ ఘటనలన్నింటికీ 418 నంబర్ గదికి సంబంధం ఉందని అతడికి అర్థమవుతుంది. ఇన్నాళ్లూ మూసి ఉన్న ఆ గదిలో ఏముంది? దాని వెనుక దాగి ఉన్న రహస్యాలేంటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!