

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో నవంబర్ 15వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. 1989లో ఇదే రోజున 16 ఏళ్ల వయసులో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించి 37 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని మరోసారి అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు తన తొలి క్రికెట్ బ్యాట్‌తో దిగిన ఫొటోను తాజాగా అదే బ్యాట్‌తో మరోసారి రీక్రియేట్ చేశారు. ఈ కొత్త ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఇదే నా తొలి బ్యాట్.. 49 ఏళ్లు గడిచినా ఇది నాతోనే ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సచిన్ పంచుకున్న ఈ ఫొటో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అభిమానులు దీనిని షేర్ చేస్తూ ఆయనకు ఆ బ్యాట్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు.
1989 నవంబర్ 15న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు మాత్రమే. పొడవాటి జుట్టుతో, చేతిలో బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్న సచిన్ చిన్ననాటి ఫొటో అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. దశాబ్దాలు గడిచినా తన తొలి బ్యాట్‌ను భద్రంగా ఉంచుకోవడం క్రికెట్‌పై ఆయనకున్న చిన్ననాటి మక్కువను గుర్తుచేస్తోంది. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ మొత్తం 34,357 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కూడా ఆయన కొనసాగుతున్నారు. వీటిలో వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు ఉన్నాయి. తన తాజా పోస్ట్‌తో సచిన్ తన క్రికెట్ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!