

తీన్మార్ వార్తల కార్యక్రమం ద్వారా సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి, ఆ తర్వాత టీవీ యాంకర్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు ఆమె వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో కేసీఆర్‌పై తన అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన బిడ్డతో కలిసి ఇంట్లోని కేసీఆర్ ఫొటోకు నమస్కరించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం ఉన్న రాజ్ బోడ అనే వ్యక్తి శివజ్యోతితో పాటు గాయని మధుప్రియ, బుల్లెట్ బండి లక్ష్మణ్‌లను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారు కేసీఆర్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ వ్యక్తిగత విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యాఖ్యలపై శివజ్యోతి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. తన గురించి ఎంత అసభ్యంగా మాట్లాడినా కేసీఆర్‌పై తన అభిమానం మారదని, తాను ఆయనకు గర్వంగా వీరాభిమానినని స్పష్టం చేశారు. గతంలో కంటే మరింత కష్టపడి కేసీఆర్ కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. తనను అవమానించడం, తప్పుడు ఆరోపణలు చేయడం లేదా వ్యక్తిగత హద్దులు దాటడం ఎవరికీ హక్కు లేదని అన్నారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నానని, వాస్తవాలు, సాక్ష్యాధారాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. తన మౌనాన్ని బలహీనతగా లేదా లొంగుబాటుగా భావించవద్దని హెచ్చరించారు. బెదిరింపులు, అసభ్యకరమైన వ్యాఖ్యలకు తాను భయపడబోనని, తన నిబద్ధత, అంకితభావమే విమర్శలకు సమాధానమిస్తాయని శివజ్యోతి తన పోస్టులో పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!