

తెలంగాణలో యువతలో డ్రగ్స్ దురలవాటు పెరుగుతున్న నేపథ్యంలో కాబోయే వరుల అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన ఒక ఘటనలో, తన కాబోయే భర్త ఫోన్‌లో గంజాయి కోసం పంపిన సందేశాలను చూసిన యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. కుటుంబం డ్రగ్ పరీక్ష చేయించాలని కోరగా అతడు నిరాకరించడంతో పెళ్లిని రద్దు చేశారు. మరో ఘటనలో డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత నిశ్చితార్థాన్ని రద్దు చేయగా, యువకుడు ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు.
డ్రగ్స్ సమస్య చదువుకున్న యువతలోనూ ఆందోళనకర స్థాయికి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలోనే 20 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు గల పలువురు ఐటీ ఉద్యోగులు, వైద్య విద్యార్థులు సహా సుమారు 40 మంది డ్రగ్స్ వినియోగదారులను ఈగల్ అధికారులు గుర్తించారు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉద్యోగం, కుటుంబ నేపథ్యంతో పాటు వరుడి వ్యక్తిగత అలవాట్లు, ప్రవర్తన, పోలీస్ కేసుల వివరాలు కూడా పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ బారిన పడిన తమ పిల్లలను మామూలు జీవితంలోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఈగల్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!