

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే తీర్పు ఇవ్వడం సరికాదని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 120 రోజులు మాత్రమే అవుతున్నందున పనితీరును అంచనా వేయడానికి మరింత సమయం అవసరమని చెప్పారు. కనీసం ఏడాది పాటు ప్రభుత్వం పనిచేసిన తర్వాతే దాని పనితీరుపై మాట్లాడాలని పేర్కొన్నారు. విజయ్‌పై తనకు గతంలోనూ కొన్ని సందేహాలు ఉన్నాయని, ఎన్నికలకు ముందే వాటిని వ్యక్తం చేశానని తెలిపారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కావడంతో దాని పనితీరును కొంతకాలం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రజలు తమ డిమాండ్ల కోసం నిరసనలు చేపడితే వాటిని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చూడాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ ఇటీవల యూకే పర్యటనలో నటుడు, రేసర్ అజిత్ కుమార్‌ను కలవడంపైనా ఆయన స్పందించారు. విదేశాలకు వెళ్లి అజిత్‌ను కలవడంలో తప్పేమీ లేదని, అసలు దృష్టి మాత్రం పర్యటన ఉద్దేశ్యం నెరవేరిందా లేదా అన్నదానిపై ఉండాలని చెప్పారు. పెట్టుబడులు తీసుకొచ్చినట్లు విజయ్ చేసిన ప్రకటనలను కూడా ఇదే నేపథ్యంలో పరిశీలించాలని పేర్కొన్నారు. విజయ్ సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో పాల్గొని ప్రారంభ జెండాను ఊపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!