

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న విలాసవంత స్లీపర్ కోచ్ బస్సు రాజస్థాన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో దౌసా జిల్లా కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనావ్డా ప్రాంతంలో బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఢీకొనగానే రెండు వాహనాలు రోడ్డుపక్కకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృతి చెందారు. మొత్తం 24 మంది గాయపడగా, వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రయాణికులు జమ్మూకశ్మీర్‌లోని వైష్ణో దేవి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రతతో ప్రయాణికుల అరుపులు, కేకలతో ప్రాంతం భయానకంగా మారింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం, వేగంగా వచ్చిన బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు గల్లంతైన వారి కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!