

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సుష్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, విప్ వేముల వీరేశం డిమాండ్ చేశారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా సీఎల్పీ వేదికగా చర్చించాలని సూచించారు. సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ సరైనదిగా లేదని వీరేశం వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పీఏసీ, ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్ కూడా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆయనపై విమర్శలు చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అన్నారు. సుస్మిత చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలను సహించబోమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ను కలిసి చర్యలు కోరనున్నట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!