

తెలంగాణలో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం.. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశంపై ప్రముఖ విద్యావేత్తలతో చర్చించారు.
బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో సమావేశమైన సీఎం.. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను వివరించి, ఆక్స్‌ఫర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలను హైదరాబాద్‌కు తీసుకురావాలని కోరారు. తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని వారిని ఆహ్వానించారు.
అనంతరం రేవంత్ రెడ్డి సోమర్‌విల్ కాలేజీని సందర్శించి, అక్కడ విద్యాభ్యాసం చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. ఆ తర్వాత జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించి, సంస్థ ప్రతినిధులతో కలిసి క్రీడా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని జీఎంఆర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!