

బీసీలు గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులోనూ వారు కీలక పాత్ర పోషించారని, వారి రుణం తీర్చుకునేలా బీసీల సంక్షేమం, సంరక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నామని తెలిపారు. చట్టానికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో ‘నేతన్నల సేవలో’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని 71,536 అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను విడుదల చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదని స్పష్టం చేశారు.
చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి సబ్సిడీ విద్యుత్తు, పింఛన్లు, చేనేత క్లస్టర్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. మత్స్యకారులు, వడ్డెరలు, గీత కార్మికులు సహా వివిధ బీసీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత రెండేళ్లలో పేదల సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా, చీరాలకు చెందిన 90 ఏళ్ల పుష్పావతి చాలా కాలంగా చంద్రబాబుతో ఫొటో దిగాలని కోరుకుంటున్న విషయం తెలుసుకున్న సీఎం ఆమెను స్వయంగా పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఇన్నాళ్లకు తన కల నెరవేరిందంటూ పుష్పావతి ఆనందం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!