

చీకట్లను తొలగిస్తూ వెలుగులు నింపే దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ పర్వదినంతో ముడిపడిన ముఖ్యమైన పురాణగాథల్లో నరకాసుర సంహారం ఒకటి. శ్రీకృష్ణుడి సారథ్యంలో సత్యభామ నరకాసురుడిని సంహరించిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఉన్న నడకుదురుగా స్థానిక పురాణ కథనాలు చెబుతున్నాయి. ద్వాపరయుగంలో ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన నరకాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి, తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించకూడదనే వరాన్ని పొందాడని కథనం. ఒకసారి వేటకు వెళ్లిన సమయంలో అతడు వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడి మరణానికి కారణమవుతుంది. ఈ పాపం నుంచి విముక్తి పొందేందుకు గురువు సూచన మేరకు కృష్ణానది తీరంలోని నడకుదురుకు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని ఆరాధిస్తాడు. అయితే, తన రాక్షస ప్రవృత్తితో అక్కడి మహిళలను బంధించి హింసించడంతో వారు శ్రీకృష్ణుడిని రక్షణ కోరతారు. దీంతో సత్యభామ సమేతంగా అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు వారిని రక్షిస్తాడు. అనంతరం జరిగిన భీకర యుద్ధంలో శివుడి వరం ప్రభావంతో శ్రీకృష్ణుడు కొద్దిసేపు స్పృహ కోల్పోతాడు. దీంతో యుద్ధరంగంలోకి ప్రవేశించిన సత్యభామ నరకాసురుడిని సంహరిస్తుంది. ఈ ప్రాంతం నరకోత్తర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని, కాలక్రమంలో ఆ పేరు నడకుదురుగా మారిందని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి.
నడకుదురులోని శ్రీ పృథ్వీశ్వరస్వామి ఆలయం ఈ పురాణగాథతో ప్రత్యేక గుర్తింపు పొందింది. నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఇక్కడ వెలసిన లక్ష్మీనారాయణులకు పాటలీ పుష్పాలతో పూజలు చేసినట్లు పురాణ కథనం. ఈ సంప్రదాయానికి సంబంధించిన విగ్రహాలు సమీపంలోని కార్తీక వనంలో ఉన్న ఆలయంలో దర్శనమిస్తాయని చెబుతారు. దేశంలో అరుదుగా కనిపించే పాటలీ వృక్షాలు నడకుదురు ప్రాంతంలో వనం మాదిరిగా పెరుగుతుండటం మరో విశేషం. కార్తీక మాసంలో ఈ చెట్లకు పూసే పుష్పాలతో భక్తులు పృథ్వీశ్వరస్వామిని పూజిస్తారు. ఆలయం సమీపంలోని కార్తీక వనంలో వందల సంఖ్యలో ఉసిరి చెట్లు ఉన్నాయి. కార్తీక మాసంలో ఇక్కడ సామూహిక సహపంక్తి భోజనాలు నిర్వహించడం ఆనవాయితీ. నరకాసుర సంహారానికి గుర్తుగా నరక చతుర్దశి రోజున నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసే సంప్రదాయం కూడా కొనసాగుతోంది. విజయవాడ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అవనిగడ్డకు వెళ్లే బస్సుల్లో ప్రయాణిస్తూ ఉయ్యూరు, పామర్రు, కూచిపూడి, చల్లపల్లి మీదుగా నడకుదురుకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలోనూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!