

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ వ్యవస్థ ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. ఆకస్మిక వరదలు సంభవించే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నదుల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!