

శివప్రతాప్ శుక్లా తెలంగాణ జైళ్లలో చేపట్టిన సంస్కరణలను ప్రశంసిస్తూ ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఏర్పాటు చేసిన మ్యూజియం, “ఫీల్ ది జైల్” కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ జైలు విధానం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఖైదీలను కేవలం బంధించి ఉంచడం కాకుండా, ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితేనే వారిలో మార్పు తీసుకురాగలమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ పాలనలో జైళ్లలో ఖైదీలు ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో తాను పలుమార్లు జైలుకు వెళ్లానని, ఎమర్జెన్సీ సమయంలో 21 రోజులు జైలులో గడిపానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఖైదీ స్వభావతః నేరస్థుడు కాదని, పరిస్థితుల ప్రభావంతో నిందితులుగా మారుతారని చెప్పారు. మరోసారి నేరానికి పాల్పడకుండా ఖైదీల్లో సంస్కరణలు తీసుకురావాలని జైలు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!