

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల నిరోధక దళాల అధిపతుల మూడో జాతీయ సదస్సు సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మాదకద్రవ్యాల నిరోధక దళాల అధిపతులతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
‘సమష్టి సంకల్పం.. ఉమ్మడి బాధ్యత’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి 2026–29 దార్శనిక పత్రంలో నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపై చర్చించనున్నారు. మాదకద్రవ్యాల ముఠాలను ఛేదించడం, కృత్రిమ మాదకద్రవ్యాలు, అక్రమ తయారీ కేంద్రాలపై చర్యలు, అంతర్జాలంలోని రహస్య వేదికలు, క్రిప్టో కరెన్సీ ఆధారిత దర్యాప్తు వంటి అంశాలు చర్చల్లో కీలకంగా ఉండనున్నాయి. మాదకద్రవ్యాల సరఫరాను నియంత్రించడం, వినియోగాన్ని తగ్గించడం, నష్ట నివారణతో పాటు కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి సారించనున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!