

దేశంలో వ్యూహాత్మక ఇంధన నిల్వలను విస్తరించేందుకు ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ వినియోగదారులపై అదనపు రుసుము విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదన అమలైతే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై సుమారు రూ.18 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇందుకోసం ఎల్‌పీజీపై కిలోకు రూ.1.29, పీఎన్‌జీ, సీఎన్‌జీ కోసం వినియోగించే సహజ వాయువుపై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటరుకు రూ.1.43 రుసుము విధించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీనికి కేంద్ర మంత్రివర్గం ఇంకా ఆమోదం తెలపలేదు.
వచ్చే పదేళ్లలో సుమారు 42 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.99 లక్షల కోట్లు) సమీకరించి ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ, సహజ వాయువు, ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రణాళిక లక్ష్యంగా ఉంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి వంటి పరిణామాల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన వివిధ మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉండగా, అధికారిక నిర్ణయం వెలువడే వరకు వినియోగదారులు వేచి చూడాల్సి ఉంటుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!