

దేశంలో ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. కొరత ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు, వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని తెలిపారు. గతంలో రోజుకు 34 వేల టన్నులుగా ఉన్న దేశీయ ఉత్పత్తిని ప్రస్తుతం 55 వేల నుంచి 56 వేల టన్నులకు పెంచినట్లు చెప్పారు. హోర్ముజ్ జలసంధి పరిణామాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ, దేశీయ వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వంటగ్యాస్ కోసం వినియోగదారులు డిజిటల్ విధానంలోనే సిలిండర్ బుక్ చేసుకోవాలని హర్దీప్ సింగ్ పూరి సూచించారు. అవసరం లేకుండా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ల కోసం క్యూలో నిల్చోవద్దని కోరారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లోనే సిలిండర్ ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వదంతుల కారణంగా సాధారణంగా రోజుకు సగటున 52 లక్షలుగా ఉండే ఎల్పీజీ బుకింగ్‌లు కొన్ని రోజుల పాటు 90 లక్షలకు పెరిగాయని చెప్పారు. పానిక్ బుకింగ్‌లను నియంత్రించేందుకు పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!