

తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రముఖ నటి విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం పండించే రాష్ట్రంలోనే సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఆమె ప్రశ్నించారు. గతంలో రూ.1,500కు లభించిన 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.2,500కు చేరిందని, సన్నబియ్యం కిలో ధర రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతున్నా నియంత్రణ చర్యలు ఎందుకు ఫలించడం లేదని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న పాత సన్నబియ్యం గత ఏడాది వానాకాలం, అంతకుముందు సీజన్లలో పండినవేనని, అప్పట్లో అవసరానికి మించి ధాన్యం ఉత్పత్తి జరిగిందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి పాత బియ్యం కొరతకు స్పష్టమైన కారణం కనిపించడం లేదని, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అక్రమ నిల్వలు, బియ్యం అక్రమ విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ పారదర్శకతపై విజయశాంతి ప్రశ్నలు లేవనెత్తారు. మరణించిన వారి పేర్లపై రేషన్ బియ్యం పంపిణీ, నకిలీ రేషన్ కార్డులు, అనర్హుల నమోదు, బియ్యం అక్రమ మళ్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల నుంచి గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు చేరే వరకు ప్రతి గింజకు లెక్క ఉండాలని సూచించారు. తెలంగాణకు ఏడాదికి 28.56 లక్షల టన్నుల బియ్యం అవసరమని, అక్టోబర్ 16 నాటికి 9.64 లక్షల టన్నుల నిల్వలు ఉండగా, మరో 18.39 లక్షల టన్నులు రావాల్సి ఉందని అధికారుల లెక్కలను ప్రస్తావించారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం పారదర్శకంగా పరిశీలన జరపాలని కోరారు. బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లు, వ్యాపారులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కింది స్థాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని విజయశాంతి స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!