

యుద్ధం కారణంగా రాజకీయంగా నష్టం ఎదురైనా.. ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా అమెరికాకు అణు ప్రతిపాదన పంపినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. శాంతి చర్చలు కొనసాగించాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లను అంగీకరించాల్సిందేనని టెహ్రాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ షరతులను అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ అధికారికంగా ఈ డిమాండ్ల జాబితాను వెల్లడించనప్పటికీ.. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించడం, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించడం వంటివి ఇందులో ఉన్నాయి. లెబనాన్ సహా ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలను ముగించాలని, ఇరాన్ భూభాగంపై దాడులు నిలిపివేయాలని కూడా కోరినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే అంతర్జాతీయ పర్యవేక్షకుల సమక్షంలో తమ దేశంలోనే ఆ నిల్వలను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమని, కానీ వాటిని దేశం దాటి తరలించేందుకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!