

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రాబోయే వర్షాలు లేదా వరదలను అంచనా వేసి కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా కేటాయింపులు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై నిర్వహించిన సమీక్షలో అధికారులు కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 76.63 శాతం, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో 68.1 శాతం నీరు అందుబాటులో ఉందని వివరించారు.
నాగార్జునసాగర్ నిల్వలను పరిగణనలోకి తీసుకుని సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ఆయకట్టు అవసరాలను అంచనా వేయాలని మంత్రి సూచించారు. వైరా రిజర్వాయర్‌ను గోదావరి నీటితో నింపే అవకాశాలను పరిశీలించి జాప్యాన్ని నివారించాలని ఆదేశించారు. దేవాదుల, నిజాంసాగర్, స్వర్ణ, సదర్మట్, రామడుగు, బుగ్గలవాగు, రామపల్లి, పాలెంవాగు, పోచారం, రాజీవ్‌సాగర్ తదితర ప్రాజెక్టుల నీటి నిల్వలను అంచనా వేసి సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. మూసీ జలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, సింగూరు ప్రాజెక్టు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై ఐఐటీ నిపుణులతో సంప్రదింపులు జరిపి, అంతర్రాష్ట్ర జల వివాదాలపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!