

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల రెండు రోజుల ‘చింతన్ బైఠక్’ బుధవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పాలన, విధాన రూపకల్పన, సంస్కరణలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై మంత్రులు విస్తృతంగా చర్చించనున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు చేపట్టిన విధానాలు, సంస్కరణలపై కొందరు మంత్రులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాల పురోగతి, గడువులోగా అమలు, అంతర్ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, సమయ నిర్వహణ తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం గతంలో ఆరుగురు చొప్పున కాకుండా ఎనిమిది మంది మంత్రులతో ఆరు గ్రూపులను ఏర్పాటు చేసి, గడువులోగా కార్యక్రమాల అమలు, పాలనకు సంబంధించిన అంశాలపై చర్చలు నిర్వహించింది. ఈ బైఠక్‌లో మంత్రిత్వ శాఖల పనితీరుపై స్వీయ సమీక్ష కూడా ఉండనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!