

ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో శిక్షణ సంస్థలు, ఏవియేషన్ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థలను అనుసంధానించి సమగ్ర విమానయాన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్ట్రంలో తొలి ‘ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ’ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆవిష్కరించారు. రెండు శిక్షణ విమానాలను జెండా ఊపి ప్రారంభించారు.
విమానయాన రంగంలో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలులో మరో ఎఫ్‌టీవోతో పాటు కడప, రాజమహేంద్రవరంలో శిక్షణ సంస్థలు, భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న హంస ఎన్‌జీ విమానాలపై ఏపీలో శిక్షణ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కర్నూలులో డీజీసీఏ, క్యూసీఐ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుపైనా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌టీవోలకు ర్యాంకింగ్ విధానం ద్వారా శిక్షణ ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!