

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనం గ్రామంలో రూ.31,387 కోట్లతో 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్, తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్‌కు భూ కేటాయింపునకు అనుమతించింది.
ఇంధనం, పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాల్లోనూ మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. పాత థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లతో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనానికి ఆమోదం తెలిపింది. విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, గ్రీన్‌కో సౌర విద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం పెంపు, అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామిక పార్కు, అన్నమయ్య జిల్లాలో ఎంఎస్‌ఎంఈ, ఫుట్‌వేర్ కాంపొనెంట్ పార్కులు, పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఏర్పాటు, ఏపీ రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ, సెమీకండక్టర్, యానిమేషన్, గేమింగ్ పాలసీల సవరణలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదానీ, హెటిరో తదితర సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులు, టీటీడీలో కొత్త పోస్టుల సృష్టి, పోలవరం జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!