

న్యూఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ తనను లైంగికంగా వేధించి, శారీరకంగా దాడి చేశారని స్వతంత్ర మహిళా జర్నలిస్ట్ రోసీ ఆరోపించడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. జంతర్ మంతర్ వద్ద సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తూ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఏసీపీ తన వెనుక నుంచి వచ్చి ఛాతీని తాకి, బలంగా తోసేశారని ఆమె సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఈ ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. పోలీసు యూనిఫాంలో ఉన్న అధికారి ప్రవర్తనపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏసీపీపై కేసు నమోదు చేయాలని జర్నలిస్టులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆరోపణలు చేసిన జర్నలిస్ట్‌తో పాటు మరో 16 మంది మీడియా సిబ్బందిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకుని ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. మహిళా జర్నలిస్టుల నుంచి మూడు వేర్వేరు వేధింపుల ఫిర్యాదులు అందినట్లు పోలీసులు వెల్లడించగా, ప్రాథమిక విచారణ కోసం కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఏసీపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వతంత్ర జర్నలిస్టులు, కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనలు కొనసాగించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!