

గుంటూరు జిల్లా మాచవరం మండల సరిహద్దుల్లోని మోర్జంపాడుకు సమీపంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. భ్రమరాంబ సమేతంగా మల్లేశ్వరుడు ఇక్కడ పూజలందుకుంటుండగా, మరోవైపు సీతారాములు కూడా కొలువై ఉండటంతో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ప్రధాన విశేషం శివలింగం పక్కనే నిరంతరం నీరు ఉబికి వచ్చే సహజ నీటి బుగ్గ ఉండటం. చుట్టుపక్కల ప్రాంతంలో నీరు అందుబాటులో లేకపోయినా, ఈ బుగ్గలో మాత్రం అన్ని కాలాల్లోనూ స్వచ్ఛమైన నీరు లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నీటితోనే స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. గర్భాలయంలో బుగ్గ మల్లేశ్వరుడితో పాటు భద్రకాళి, వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు. సుమారు ఆరు శతాబ్దాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని స్థానిక చరిత్ర చెబుతోంది.
అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ధూపదీప నైవేద్యాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. ఆలయ ప్రాంగణంలో వృద్ధ లింగేశ్వరుడు, సీతారాములు, ఆంజనేయస్వామి, నాగేంద్ర స్వామి ఉపాలయాలు ఉన్నాయి. కాశీ నుంచి తీసుకొచ్చిన నర్మదా లింగం, నందీశ్వరుడు, టేకు ధ్వజం కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. సంతానం లేనివారు నాగేంద్ర స్వామిని భక్తితో పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది. వారంలో సోమవారం మాత్రమే పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. కార్తీక మాసం, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిడుగురాళ్ల నుంచి మోర్జంపాడు మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి ప్రైవేటు వాహనాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న వివరాలు కొందరు నిపుణుల అభిప్రాయాలు, వివిధ శాస్త్రాల్లో ప్రస్తావించిన అంశాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిలోని అన్ని విషయాలకు ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. కాబట్టి, ఈ సమాచారాన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!