

భారతదేశంలో మహిళల పెట్టుబడి ధోరణిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు బంగారం, తపాలా పొదుపు పథకాలు, చిట్ నిధులు, స్థిర నిక్షేపాలకే పరిమితమైన మహిళలు ఇప్పుడు సంపద సృష్టి వైపు అడుగులు వేస్తున్నారు. పదవీ విరమణ ప్రణాళికలు, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు, ఆర్థిక స్వాతంత్య్రం వంటి లక్ష్యాలతో పెట్టుబడులు పెడుతున్నారు.
పరస్పర నిధుల రంగ గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి. దేశీయ పరస్పర నిధి పెట్టుబడిదారుల్లో మహిళల వాటా 25 శాతానికి పైగా ఉంది. వ్యక్తిగత పరస్పర నిధుల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో వారి వాటా 33 శాతానికి పైగా నమోదైంది. మహిళల నిర్వహణలో ఉన్న పరస్పర నిధుల ఆస్తుల విలువ రూ.11.3 లక్షల కోట్లు దాటగా, మొత్తం నిధుల ప్రవాహాల్లో వారి వాటా 35 శాతం ఉంది. అలాగే పెట్టుబడులు ప్రారంభించిన మహిళల్లో 80 శాతం మంది 35 ఏళ్లలోపే పెట్టుబడులు మొదలుపెట్టడం విశేషం.
మహిళలు బంగారాన్ని పూర్తిగా వదిలేయడం లేదు. భద్రత కోసం బంగారాన్ని కొనసాగిస్తూనే, క్రమబద్ధ పెట్టుబడి పథకాలు, పరస్పర నిధులు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులతో సమతుల్య పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో పెరిగిన పాత్ర, సాంకేతిక సౌకర్యాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
పెట్టుబడుల విషయంలో మహిళలు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం, మార్కెట్ ఒడిదుడుకుల్లో భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండడం, సమతుల్య పెట్టుబడులను కొనసాగించడం వారి ప్రత్యేకతగా మారింది. ఈ ధోరణి ఇప్పుడు మహానగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, నగరాలకు కూడా విస్తరిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!