

దేశంలో కీలక రెపో రేటును మరింతగా తగ్గించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అక్టోబర్ నెలలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలోనే రెపో రేటు తగ్గింపులకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఆ తరువాత వచ్చిన గణాంకాలు కూడా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని నిరూపించాయని తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే ఎంపీసీ సమావేశం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది పూర్తిగా కమిటీ నిర్ణయమని ఆయన అన్నారు. 2024 సంవత్సరం తొలి భాగంలో ఎంపీసీ రెపో రేటును ఒక్క శాతం మేరకు తగ్గించగా, అక్టోబర్ నెలలో మాత్రం విరామం ఇచ్చింది. అక్టోబర్లో చిల్లర ద్రవ్యోల్బణం 0.25 శాతానికి తగ్గడం, మరో విడత రెపో రేటు తగ్గింపుకు సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న ఆర్థిక, ద్రవ్య మరియు నియంత్రణ చర్యల వల్ల ప్రైవేట్ పెట్టుబడి పునరుజ్జీవానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలను తట్టుకుని, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కొంత ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, ఈ ధోరణి నిలకడగా కొనసాగుతుందా, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంలో అనిశ్చితి ఉందని పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన పన్ను రేట్ల తగ్గింపులు, ద్రవ్య విధాన సడలింపులు వినియోగ వృద్ధికి ఊతం ఇస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5 శాతంగా, వచ్చే ఏడాది 6.7 శాతంగా ఉండొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. రెండో త్రైమాసిక అధికారిక గణాంకాలు త్వరలో విడుదల కానున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఆర్థిక అస్థిరతలు తగ్గి, కార్మిక ఆధారిత రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!