

ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత తగ్గే అవకాశముందని ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక అంచనా వేసింది. జూన్ నాటికి బ్యారల్ ధర 50 డాలర్ల స్థాయికి పడిపోయే వీలుందని తెలిపింది. క్రూడ్ ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తుందని, దీని ప్రభావంతో దేశ జీడీపీ వృద్ధి రేటు అదనంగా 0.10 నుంచి 0.15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన వెనెజువెలాపై గత వారాంతంలో అమెరికా దాడులు జరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెద్దగా పెరగలేదని నివేదిక స్పష్టం చేసింది. గత వారం రోజులుగా బ్యారల్ ధర సుమారు 60 డాలర్ల పరిధిలోనే కొనసాగుతోంది.
భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. అంతేకాదు, మొత్తం దిగుమతి వ్యయంలో ఇంధన బిల్లు ప్రధాన వాటాను కలిగి ఉంది. గత గణాంకాలను పరిశీలించి, ప్రస్తుత స్థాయితో పోలిస్తే క్రూడ్ ధరలు 14 శాతం మేర తగ్గితే, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు 3 శాతం బలపడుతూ రూ.87.5 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఇక చమురు నిల్వలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి వరకు)లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 55 డాలర్ల స్థాయికి దిగిరావచ్చని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంచనా వేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!