

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని ఎరువుల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ముఖ్యంగా ఎల్ఎన్జీ, అమ్మోనియా వంటి కీలక ముడి పదార్థాల సరఫరా మూడు నెలలపాటు అంతరాయం కలిగితే, దేశంలో యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తి 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే యూరియా తయారీ ప్లాంట్లకు గ్యాస్ సరఫరాలో 70 శాతం కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ సమస్యను కొంతవరకు తగ్గించగలదని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఎరువుల నిల్వలు మూడు నెలల అవసరాలకు సరిపోతాయని, దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, దిగుమతి ఎరువుల ధరల పెరుగుదలతో పాటు ముడి పదార్థాల రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఎరువుల కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగే అవకాశముందని కులకర్ణి తెలిపారు. దీని ప్రభావంగా ఎరువుల సబ్సిడీ భారం రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా వేశారు.
భారతదేశం ఇప్పటికీ తన యూరియా అవసరాల్లో సుమారు 20 శాతం, కాంప్లెక్స్ ఎరువుల్లో దాదాపు మూడో వంతు దిగుమతులపై ఆధారపడుతున్నదని ఆయన గుర్తు చేశారు. అలాగే యూరియా, డీఏపీ దిగుమతుల్లో 40 శాతం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుండగా, దేశీయ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ఎల్ఎన్జీలో 60 నుంచి 65 శాతం, అమ్మోనియాలో 75 నుంచి 80 శాతం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నాయని వివరించారు.




.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!