

దేశీయ మార్కెట్లో పండుగల అనంతరం కూడా వాహనాల విక్రయాలు జోరుగా కొనసాగాయి. ప్రయాణికుల వాహనాల (కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీల)కు బలమైన గిరాకీ లభించడంతో 2024 నవంబరుతో పోలిస్తే గత నెలలో వాహన రిజిస్ట్రేషన్లు 2% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. మొత్తం వాహన రిటెయిల్ విక్రయాలు 2024 నవంబర్ లో 32,31,526 కాగా, గత నెలలో 33,00,832కు చేరాయి. గతేడాది దీపావళి, ధనత్రయోదశి అక్టోబర్ చివర్లో రావడంతో, వాహన రిజిస్ట్రేషన్లు నవంబర్ లో జరిగాయని, ఫలితంగా అమ్మకాలు మెరుగ్గా నమోదైనట్లు ఫాడా తెలిపింది. GST రేట్ల కోతలు, వాహన డీలర్ల రిటెయిల్ ఆఫర్లతో ఈసారి సెప్టెంబర్ చివర నుంచి కొనుగోలుదార్ల గిరాకీ పెరిగింది.
పండగల సీజన్ తర్వాత కూడా షోరూమ్‌లకు వినియోగదారులు వస్తున్నారు అని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ పేర్కొన్నారు. ఈ ఏడాది రబీ సీజన్ మెరుగ్గా ప్రారంభమైందని, గ్రామీణ సెంటిమెంట్, ఆర్థిక వ్యవస్థ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో సమీపకాలంలోనూ వాహన విక్రయాల జోరు కొనసాగొచ్చని ఫాడా అంచనా వేసింది. ఈ ఏడాది చలి సాధారణం కంటే అధికంగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో, వాహన అవసరాలు పెరగొచ్చని తెలిపింది. ఎఫ్ఎమ్సీజీ, ట్రాక్టర్లు, గ్రామీణ ద్విచక్ర వాహన మార్కెట్లకు ఇది అనుకూలమని పేర్కొంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!