

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో ఒత్తిడిలో ఉన్న రంగాలకు ఊతమివ్వడంపై ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తయారీ రంగాన్ని వేగవంతం చేసి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏడు రంగాలను వ్యూహాత్మక ప్రాధాన్యతా రంగాలుగా ప్రకటించింది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సెమీకండక్టర్ చిప్స్, టెక్స్టైల్స్, బయోఫార్మా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల విడిభాగాల తయారీ, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్ రంగాలు ఇందులో ఉన్నాయి.
ఈ రంగాల్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సెమీకండక్టర్ చిప్స్ ఇప్పటికే చైనా ఆంక్షల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ట్రంప్ సుంకాల కారణంగా టెక్స్టైల్ ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశీయంగా ఆత్మనిర్భరత సాధించాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయోఫార్మా రంగం అభివృద్ధికి రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం దేశీయ ఫార్మా పరిశ్రమకు గణనీయంగా తోడ్పడనుంది. ఇదే సమయంలో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కారణంగా స్టాక్ మార్కెట్లో నష్టపోతున్న చిన్న, రిటైల్ మదుపరులను రక్షించేందుకు ఆర్థిక మంత్రి నియంత్రణ చర్యలను కూడా ప్రకటించారు.
దేశీయంగా కంటైనర్ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పోటీ చేయగలిగే కంటైనర్ తయారీ వ్యవస్థను భారత్లోనే అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. పర్యావరణ హితమైన సరుకు రవాణాకు ఊతమిచ్చేలా, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ (సీఐఈ) రంగాన్ని ప్రోత్సహించే మరో పథకాన్ని కూడా బడ్జెట్లో ప్రకటించారు. అత్యాధునిక, అధిక నాణ్యత గల సీఐఈని దేశీయంగా తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!